సీసీ రోడ్లు వేశారు… సైడ్ డ్రైనేజీలు మరిచారు..!
రోడ్లపై నీరు ఇబ్బందుల్లో తండా వాసులు
బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, రాయపర్తి: మండలంలోని సూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలో గతంలో సిసి రోడ్లు వేసి సైడ్ డ్రైనేజీలు మరిచారని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం ఇటీవల తండా బాట కార్యక్రమంలో భాగంగా రాయపర్తి మండలంలోని తండాలలో శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. సూర్య తండాలో పర్యటిస్తుండగా అక్కడికి గ్రామస్తులు తమ గోడును విన్నవించుకున్నారు.సీసీ రోడ్లు వేయడంతో వారి ఇండ్లు రోడ్డు కంటే కిందకు అయిపోయి వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వస్తుందని, సైడ్ డ్రైనేజీలు లేక రోడ్లపై నీళ్లు నిలిచి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ విషయంపై పాలకులు,అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామస్తుల వినతి మేరకు స్పందించిన పరుపాటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జేసీబీ సహాయంతో ఆరు పైపులు వేయించి రోడ్లపై నీరును తండా పక్కన ఉన్న కుంటలోకి మళ్ళించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, స్థానిక మాజీ ఎంపీటీసీ వెంకన్న, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి సంకినేని ఎల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.


