ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మధిర మండలం తొండలగోపవరం గ్రామపంచాయతీ పరిధిలోని సాయిపురం ఆంజనేయ స్వామి గుడిలో దొంగలు పడి హుండీని పగలగొట్టినట్టు సంచారం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి తాళాలు విరగదీసి లోనికి చొరబడి, భక్తులు సమర్పించిన కానుకలతో ఉన్న హుండీని ధ్వంసం చేసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు.
ఉదయం గుడికి వచ్చిన భక్తులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. సంఘటనతో గ్రామంలో కలకలం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించినట్టు తెలిసింది.
హుండీలో ఎంత మొత్తంలో నగదు ఉండేదన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల గ్రామ ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతుండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయాల వద్ద భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.


