పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల
రూ.2.36 కోట్ల రోడ్డు, డ్రైనేజ్ పనుల శంకుస్థాపన
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు, రేషన్ కార్డుల పంపిణీ
కాకతీయ, ఖమ్మం : రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం ఖమ్మం 57వ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలో రూ.2 కోట్ల 36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి తుమ్మల ఖమ్మం నగరానికి 2వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే, వాటిలో 200 పైగా ఇళ్లు 57వ డివిజన్‌లో కేటాయింమని, పేదలకు విడతల వారీగా మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వంటి పథకాలను ఇంటివద్దకే చేరుమని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, ఒకసారి చేసిన పని పదేళ్ల పాటు నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల నిర్మాణ ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సూచించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. మంత్రి తుమ్మల కృషి ఫలితంగా 57వ డివిజన్‌లో 230 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయని, ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట మేరకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇప్పటికే అందించాం” అని అన్నారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని, పారిశుద్ధ్య చర్యల్లో మరింత శ్రద్ధ చూపాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఆర్డీఓ నరసింహారావు, మునిసిపల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. రంజిత్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


