పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లు
ఏడాదిలో ఏదులాపురంను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాం
: మంత్రి పొంగులేటి
కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ, బస్ షెల్టర్, జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. బారుగూడెంలో రూ.24.27 లక్షలు, గొల్లగూడెంలో రూ.37.20 లక్షలు, నాయుడుపేటలో రూ.44.50 లక్షలు, నడిమితండలో రూ.77.10 లక్షలు, జలగం నగర్‌లో రూ.29.30 లక్షలు, ఆటోనగర్‌లో రూ.17.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
రూపు మారుతున్న మున్సిపాలిటీ
నాయుడుపేటలో రూ.26.30 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులు, మహబూబాబాద్ క్రాస్‌రోడ్ జంక్షన్ వద్ద రూ.7.40 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణం, రూ.24.30 లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఏదులాపురం మున్సిపాలిటీ 19వ వార్డు గొల్లగూడెంలో రూ.42.26 కోట్లతో 14 అభివృద్ధి పనులు, పెద్దతండ గ్రామపంచాయతీలో సుమారు రూ.14 కోట్లతో పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. గత పాలకుల హయాంలో మౌళిక వసతుల కల్పనను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన మంత్రి, రాబోయే ఏడాది కాలంలో ఏదులాపురం మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మున్నేరు వరదలతో ఇబ్బంది పడ్డ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వర్షాకాలం నాటికి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
పేదలకే ప్రాధాన్యం.. సంక్షేమమే దిక్సూచి
ఆటోనగర్ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా మౌళిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న మంత్రి, వారం రోజుల్లో మరో రెండు రోడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించిన మంత్రి, ఇందిరమ్మ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాబోయే మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట పారదర్శకంగా పంపిణీ చేస్తామని, ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


