- రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- గత 21 నెలల్లో రూ.12. 47 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
- రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
కాకతీయ, ఖమ్మం రూరల్ : పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలోని చిన్న వెంకటగిరి ప్రాంతంలో ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జి ప్లస్2 కాలనీ వరకు ప్రతిపాదించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జిప్లస్2 కాలనీ వయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 వరకు బీటీ రోడ్డును కోటి 71 లక్షలతో శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు.
ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కోటి 53 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, రూ.2 కోట్ల 65 లక్షలతో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, మంచినీటి సరఫరా కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. వెంకటగిరి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా జంగాల కాలనీ వరకు కోటి 32 లక్షలతో, ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోట నారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు 2 కోట్ల 50 లక్షల రూపాయలతో, వెంకటగిరి ఎస్సీ, బిసి కాలనీ నుండి గుదిమల్ల వరకు 2 కోట్ల 4 లక్షలతో మంజూరు చేసామని, వీటికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గడిచిన 21 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.12.47 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. అర్హులైన పేదలందరికీ మరో మూడు విడతలలో రాజకీయాలకతీతంగా సొంత ఇండ్లు ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. కోటి 71 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకుంటున్నామని, దీని వల్ల ఇందిరమ్మ కాలనీలోని వందలాది కుటుంబాలకు ఖమ్మం, కోదాడ రోడ్డు కనెక్టివిటీ వస్తుందని అన్నారు. మంత్రి సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో అదనపు సౌకర్యాలైన డ్రైయిన్, త్రాగునీరు, అంతర్గత రోడ్ల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమ అనంతరం అక్కడే గతంలో చేపట్టి, నిర్మాణం పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


