ప్రజల గొంతుక ఎర్రజెండానే
మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన సీపీఎం నిలబడింది
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు
కాకతీయ, గజ్వేల్ : ప్రజల తరఫున నిజాయితీగా కొట్లాడేది ఒక్క సీపీఎం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా 12వ వార్డు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు డబ్బు సంచులు, భూములు, వ్యాపారాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 12వ వార్డు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలతో కూడిన ప్రాంతమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మొదటి నుంచీ పోరాడింది సీపీఎమేనని గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ఇప్పటికీ ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరగలేదని, యువత, ఒంటరి మహిళలు, వృద్ధులకు ప్యాకేజీలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్–బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఎం అభ్యర్థి బండ్ల స్వామిని సుత్తి–కొడవలి–చుక్క గుర్తుపై భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గెలిపిస్తే ముంపు గ్రామాల సమస్యలపై గజ్వేల్ మున్సిపాలిటీలో బలమైన గొంతుకగా నిలుస్తారని చెప్పారు. సభలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


