వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి
తహసిల్దార్ ద్వారా ప్రధానికి వినతిపత్రం సమర్పణ
కాకతీయ, తుంగతుర్తి : వ్యాలిడేషన్ చట్టం–2025ను వెంటనే రద్దు చేసి, పెన్షన్ దారుల హక్కులను కాపాడాలని తుంగతుర్తి మండల పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పాలవరపు సంతోష్ డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, జీవన వ్యయాలకు అనుగుణంగా పెన్షనర్లకు లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని పార్లమెంటులో పునర్విమర్శ చేసి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు భరోసా కల్పించాలని, ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశవ్యాప్తంగా నిరసనలు.. వినతిపత్రం సమర్పణ
అఖిల భారత పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా తుంగతుర్తిలో కూడా పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసిల్దార్ ద్వారా వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలని కోరుతూ ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు రవీందర్ రెడ్డి, యాదగిరి, పుల్లయ్య, మాధవరావు, మల్లయ్య, ఇంద్రసేనారెడ్డి, కృష్ణారెడ్డి, విజయమ్మ, సోమయ్య, దాసు, పురుషోత్తం, సుధాకర్ రెడ్డి, జాన్, లలిత, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


