- అడిషనల్ డీసీపీ వెంకటరమణ
- శాంతినగర్, వినాయకనగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
- 105 వాహనాలు స్వాధీనం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, వినాయకనగర్ ప్రాంతాల్లో బుధవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా, వాహనాలు సరైన ధృవపత్రాలతో ఉన్నాయా అనే అంశాలపై విస్తృత తనిఖీలు జరిగాయి. ఫలితంగా, 105 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 77 బైకులు, 27 ఆటోలు, ఒక ట్రక్ ఉన్నాయి.
పోలీసులు స్థానికులకు సైబర్ నేరాల విషయంలో జాగ్రత్త పాటించాలని సూచించారు. సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే స్పందించి, 1930 నంబర్ ద్వారా తస్కరించిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు. అంతేకాక, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, అమ్మకం చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేశారు. వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. స్థానికులు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్, సంజీవ్, సదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


