లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు
కొత్తగూడెంలో కార్మిక సంఘాల జేఏసీ భారీ ప్రదర్శన
చుంచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా
కార్మిక–కర్షక ఐక్య పోరాటానికి నాయకుల పిలుపు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కార్మిక హక్కుల సాధన కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో కార్మిక వర్గం పెద్దఎత్తున కదిలింది. కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించి చుంచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులు, రైతులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కార్మిక–కర్షక ఐక్యతే బలం
సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు జలీల్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు సీతారామయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు కందగట్ల సురేందర్, టీజేఎస్ నాయకులు బాబు తదితరులు మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నంగా ఈ లేబర్ కోడ్‌లు ఉన్నాయని విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ చట్టాలను అమలు చేయాలనుకుంటే కార్మిక–కర్షక ఐక్య శక్తితో తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కే. బ్రహ్మచారి, మల్లెల రామనాథం, సంజీవ్, భూక్య రమేష్, నాగభూషణం, రాజేష్, బాలరాజు, నగేష్, సక్రం, పాషా, కళావతి, శైలజ, రేష్మ, దుర్గమ్మ, గంగ, నిహారిక, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


