పీఏఐ పరీక్షల్లో తెలంగాణ యువకుడి సత్తా
సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జాతీయస్థాయిలో 5వ ర్యాంక్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన షేక్ సలీం జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించాడు. బుధవారం విడుదలైన భారత ఓడరేవులు (Ports Authority of India) సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఫలితాల్లో 5వ ర్యాంకు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచాడు. హాల్ టికెట్ నంబర్ IP525007943తో పరీక్షకు హాజరైన సలీం, మొత్తం 160 మార్కులకు గాను 146.25 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా సివిల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన 14 పోస్టులకు నియామక ప్రక్రియ జరగగా, వీటిలో 9 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 5 అసిస్టెంట్ మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఫెసిలిటీస్) పోస్టులు ఉన్నాయి. సలీం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు అర్హత సాధించాడు. ఈ నియామక పరీక్షను 2025 డిసెంబర్ 2న నిర్వహించారు. 2002 జనవరి 2న నాగులవంచలో జన్మించిన సలీం, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివాడు. అనంతరం న్యూ విజన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు పొందాడు. 2024లో ఎన్ఐటీ వరంగల్‌లో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేశాడు. భవిష్యత్తులో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (IES) సాధించడమే తన లక్ష్యమని సలీం తెలిపారు. అతని తండ్రి షేక్ నాగుల్ మీరా ఖమ్మం మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జాతీయస్థాయిలో తమ గ్రామానికి చెందిన యువకుడు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల నాగులవంచ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


