పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
అధికారానికి మించి అనుబంధాలకు ప్రాధాన్యం
అమ్మ–అత్తమ్మల పర్యవేక్షణలో పసందైన వంటకాలు
సంక్రాంతి వేళ నోరు తీపి చేసే సంప్రదాయం
ఉమ్మడి ఖమ్మాన్ని హత్తుకుంటున్న కుటుంబ సంస్కృతి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం. సంక్రాంతి పండుగను కేవలం వేడుకగా కాకుండా, తోటి మనుషుల నోరు తీపి చేసే సందర్భంగా భావిస్తూ ఆతిథ్యానికి కొత్త అర్థం చెబుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతి ఏటా తమను నమ్ముకున్న వారికి స్వయంగా తయారు చేసిన పిండివంటలు అందించే సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈసారి పిండివంటల తయారీకి ప్రత్యేక ఆకర్షణ జతైంది. మాధురి తన అత్తమ్మ స్వరాజ్యమ్మ, అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కుటుంబ పెద్దల సమక్షంలో, పాతకాలపు రుచులు గుర్తుకు వచ్చేలా వంటశాల సందడిగా మారింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మరీ, ఇంట్లోని పెద్దల మార్గనిర్దేశంలో వంటలు చేయించడం కుటుంబ విలువలకు నిదర్శనంగా నిలిచింది.

ఘుమఘుమలాడే సంక్రాంతి రుచులు
ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ఈ రోజుల్లో ఓ పెద్ద వంటిల్లులా మారింది. నేతి అరిసెలు, ఫ్లవర్ బాదుషాలు, మిక్చర్, నెలవంకలు వంటి నోరూరించే పిండివంటలు ఘుమఘుమలాడుతున్నాయి. “మా కోసం నిరంతరం శ్రమించే సిబ్బంది కూడా మా కుటుంబ సభ్యులే” అని మాధురి చెప్పడం ఆమె ఆత్మీయతకు నిదర్శనం. బయట కొనుగోలు చేసిన స్వీట్లకన్నా, తమ చేతులతో చేసిన వంటకాల్లోనే నిజమైన ప్రేమ దాగి ఉంటుందన్నది ఆమె నమ్మకం.
ఏడాది పొడవునా పంచే అనురాగం..!
పొంగులేటి కుటుంబానికి పదిమందితో ప్రేమను పంచుకోవడం ఎప్పటి నుంచో అలవాటు. వేసవిలో ఆవకాయ పచ్చడి, ప్రతి సంక్రాంతి పండుగ వేళ పిండివంటలు పంపడం ఆ కుటుంబానికి ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఎన్ని పనులు, బాధ్యతలు ఉన్నా… తమను నమ్ముకున్న మనుషులను గౌరవించే ఈ సంస్కృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరి హృదయాలను హత్తుకుంటోంది.


