ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్
ఎన్నికల మేనిఫెస్టోకు కార్యరూపం
కోతుల బెడదకు చెక్ పెట్టిన గ్రామ పాలకవర్గం
ఒక్కో కోతికి రూ.250 చొప్పున వ్యయం
కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘గెలిపిస్తే కోతుల బెడద నుంచి గ్రామాన్ని విముక్తి చేస్తా’ అని ఇచ్చిన మాటకు కట్టుబడి శనివారం కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పాలకవర్గం సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో పంటలు, ఇళ్లకు నష్టం జరుగుతుండగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ చొరవతో కోతుల పట్టింపు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కోతికి రూ.250 చొప్పున ఖర్చు చేసి వాటిని పట్టించినట్లు సర్పంచ్ తెలిపారు. పట్టుకున్న కోతులను సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ పరిసర ప్రాంతాల్లో తీసుకెళ్లి వదిలేశామని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తన లక్ష్యమని, గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బింగి వెంకటేశ్వర్లు, కడారి సుకన్య, మరికంటి జానకమ్మ, దేవదాసు, రాయుడు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


