దేశంలోనే ధనవంతమైన బల్దియా !
ఆదాయంలో బీఎంసీ రికార్డు..!
మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక దృష్టి
ముంబై : మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో 29 కార్పొరేషన్లు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ధనవంతమైన మున్సిపల్ సంస్థగా పేరుగాంచిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ప్రత్యేక దృష్టి కేంద్రీకృతమైంది. కోట్ల రూపాయల బడ్జెట్, విస్తృత ఆదాయ వనరులు, భారీ వ్యయాలతో బీఎంసీ దేశంలోని ఇతర మహానగర కార్పొరేషన్లకు భిన్నంగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి బీఎంసీ బడ్జెట్ అంచనా రూ.59,954.7 కోట్లుగా ఉంది. ఇది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (రూ.16,683 కోట్లు), బెంగళూరు బీబీఎంపీ (రూ.12,369 కోట్లు) బడ్జెట్లను కలిపినా రెట్టింపు కావడం విశేషం. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ మాత్రం రూ.5,166.5 కోట్లకే పరిమితమైంది. గత పదేళ్లలో బీఎంసీ బడ్జెట్ దాదాపు రెట్టింపు అయ్యింది. 2015–16లో రూ.20,500 కోట్లుగా ఉన్న వ్యయం 2024–25 నాటికి రూ.44,500 కోట్లకు చేరింది.
ఆదాయంలోనూ దూసుకుపోతున్న బీఎంసీ
2024–25లో బీఎంసీ మొత్తం ఆదాయం రూ.81,774 కోట్లుగా అంచనా వేశారు. ఫీజులు, యూజర్ ఛార్జీలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. సేవలు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్, ప్రకటనలు, నీటి కనెక్షన్లు వంటి వాటి ద్వారా 2016 నుంచి 2025 మధ్య రూ.94,600 కోట్లు వసూలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో రూ.86,700 కోట్లు లభించాయి. ఇతర ప్రభుత్వ సంస్థల తరఫున సేవలు అందించినందుకు కూడా బీఎంసీ భారీ మొత్తాలు వసూలు చేసింది. 2023–24లో బాంద్రా–కుర్లా రోడ్ల శుభ్రతకు ఎంఎంఆర్‌డీఏ నుంచి రూ.61.7 కోట్లు వసూలు చేయడం అందుకు ఉదాహరణ.
పన్నుల వసూళ్లతో భారీ లాభం
విద్యుత్, ప్రాపర్టీ, నీటి, థియేటర్, వీధి పన్నుల రూపంలో 2016–25 మధ్య రూ.75,800 కోట్లు బీఎంసీ ఖజానాకు చేరాయి. స్థిర నిధులు, వాటిపై వడ్డీ కూడా వార్షిక ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.గత పదేళ్లలో నగర అభివృద్ధి, మౌలిక వసతులపై బీఎంసీ రూ.1,11,600 కోట్లు ఖర్చు చేసింది. రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థ, ప్రజారోగ్యం, విద్య, భద్రత, ఉద్యోగుల జీతాలు–పింఛన్లు ప్రధాన వ్యయాంశాలుగా ఉన్నాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలకు గ్రాంట్లుగా రూ.10,700 కోట్లు వెచ్చించింది. ప్రజా మౌలిక సదుపాయాల నిర్వహణకు రూ.36,300 కోట్లు ఖర్చు చేసింది.
2024–25లో మాత్రమే దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు రూ.99.5 కోట్లు, ఎలుకల నియంత్రణకు రూ.12.8 కోట్లు వెచ్చించడం గమనార్హం. దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే బీఎంసీ ఆర్థిక శక్తి, వ్యయ సామర్థ్యం అసమానంగా ఉండటంతో, రాబోయే మేయర్ ఎన్నికలు రాజకీయంగా మాత్రమే కాక ఆర్థికంగా కూడా ఎంతో కీలకంగా మారాయి.


