హామీ మాటగా కాదు.. చేతలుగా నిలిచింది!
ఆడబిడ్డ పుడితే రూ.2,000 నజరానా
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పెనుబల్లి మహిళా సర్పంచ్
కాకతీయ, కొత్తగూడెం : ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం సాధారణమే. కానీ గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం అరుదు. అలాంటి రాజకీయ వాతావరణంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచిన మహిళా సర్పంచ్‌గా పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ రెడ్డి సుజాత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయతీ నుంచి సీపీఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి సుజాత 350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ఆమె భర్త రెడ్డి శ్రీనివాస్ సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి బాటలు వేసిన నేపథ్యంలో, ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేస్తూ రెడ్డి సుజాతకు పట్టం కట్టారు.
ఎన్నికల హామీలకు కార్యరూపం
సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రెడ్డి సుజాత శ్రీకారం చుట్టారు. మొదటి దశలో గ్రామం నుంచి స్మశానవాటిక వరకు సుమారు 400 మీటర్ల పొడవున సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరో కీలక హామీని అమలు చేశారు. గ్రామంలో ఆడబిడ్డ జన్మిస్తే రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సాకారం చేశారు. గ్రామానికి చెందిన అరవింద్–నందిని దంపతులకు ఆడబిడ్డ పుట్టిన విషయం తెలుసుకున్న సర్పంచ్, సోమవారం వార్డు సభ్యులు, సీపీఐ మండల నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి రూ.2,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్పందించిన సీపీఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి కూడా అదనంగా రూ.1,000 ఆర్థిక సహాయం అందించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రెడ్డి సుజాత మాట్లాడుతూ… గ్రామంలో జన్మించే ప్రతి ఆడబిడ్డకు ఈ సహాయం అందిస్తామని, బాలికలు, మహిళలకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని తెలిపారు. అలాగే గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సర్పంచ్ చేపట్టిన ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు, ఆడబిడ్డల పట్ల సమాజ దృక్పథం మార్పుకు దోహదపడుతుందని సీపీఐ నాయకులు, గ్రామస్తులు ప్రశంసించారు. ప్రజాప్రతినిధి అంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలన్న సందేశాన్ని రెడ్డి సుజాత పెనుబల్లిలో స్పష్టంగా చాటుతున్నారని వారు వ్యాఖ్యానించారు.


