ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగలకే ఇవ్వాలి
ఎస్సీ మహిళ రిజర్వేషన్లో మాదిగలకు ప్రాధాన్యం కల్పించాలి
కాంగ్రెస్, మంత్రి పొంగులేటి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
ఎంఆర్పీఎస్ జిల్లా బాధ్యులు కందుల బాబు మాదిగ డిమాండ్
కాకతీయ,ఖమ్మం: ఖమ్మం రూరల్ ఏదులాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని మాదిగ వర్గానికి కేటాయించాలని ఎంఆర్పీఎస్ జిల్లా బాధ్యులు కందుల బాబు మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి మాదిగలు నమ్ముకుంటూ వస్తున్నప్పటికీ, అసెంబ్లీ, జిల్లా పరిషత్, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. ప్రస్తుతం ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మాదిగ వర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎస్సీ మహిళా కౌన్సిలర్లలో కందుకూరి శేషమ్మ, గోడ్డు గొర్ల కృష్ణకుమారి, కోటమర్తి సునీతలో ఒకరికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని సూచించారు. మాదిగ వర్గానికి న్యాయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాంబవ గ్రూప్ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.


