ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగలకే ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ డిమాండ్
కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ మాదిగలకు చెందిన అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందారని తెలిపారు. అధిక స్థానాలు సాధించిన మాదిగలకు చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయసమ్మతమని పేర్కొన్నారు. మున్సిపాలిటీతో పాటు పాలేరు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన జనాభా, ఓటు బ్యాంకు గణనీయంగా ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక స్థానాలు సాధించిన మాదిగలను పక్కనపెట్టి ఇతర సామాజిక వర్గాలకు చైర్మన్ పదవి కేటాయించే ప్రయత్నాలు ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. మాదిగలు ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి అండగా నిలిచారని, వారి సేవలను గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, రిజర్వేషన్ న్యాయబద్ధతను పాటిస్తూ మాదిగలకు చైర్మన్ పదవి దక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు, జనాభా, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితమని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులం డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నే రామారావు మాట్లాడుతూ, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మాదిగలే అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సముచిత నిర్ణయం తీసుకుని మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


