ప్రజలే నా బలం.. ప్రజల వద్దకే ప్రజా పాలన
అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి
ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి ఈసం స్రవంతి
కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురు పాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈసం స్రవంతి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ, “అనంతారం గ్రామ ప్రజలే నా బలం. ప్రజల వద్దకే ప్రజా పాలన కొనసాగిస్తాను” అని అన్నారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని, అభివృద్ధికి అవసరమైన నిధులు తెచ్చి ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని తెలిపారు. అలాగే గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సమస్యను గ్రామస్తుల సమక్షంలో చర్చించి, పారదర్శకంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. “గ్రామ ప్రజలారా… ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి, ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి” అంటూ ఓటర్లను పేరుపేరునా అభ్యర్థించారు. అనంతారం గ్రామంలో స్రవంతి ప్రచారానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తోందని స్థానికులు చెబుతున్నారు.


