చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?
ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ అటవీ అధికారులు
అసలు దోషులు తప్పించుకుంటున్నారా?
‘టన్నుల లెక్కన’ లంచం డిమాండ్
భద్రాద్రి జిల్లా అటవీశాఖలో అక్రమార్కులు
ఏసీబీ దాడులతో మరికొంతమంది అధికారులపై చర్చ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కాసులకు కక్కుర్తి పడి అటవీ శాఖ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కంచె చేను మేసిందా అన్న చందంగా ఉన్న ఈ వ్యవహారంలో, సోర చేపను వదిలేసి చిన్న చేపలకే ఏసీబీ వల పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డామిట్ కథ అడ్డం తిరుగుతుందో ఏమో కానీ, అసలు దోషులు పక్కకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖను డివిజన్ల వారీగా మూడు జోన్లుగా విభజించారు. కొత్తగూడెం జోన్–1, జోన్–2, అన్నపురెడ్డిపల్లి జోన్–3గా విభజన జరిగింది. కొత్తగూడెం జోన్–1 పరిధిలో సుమారు 5,500 ఎకరాల్లో జామాయిల్ తోటలు ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, గరిమెళ్లపాడు, పెనుబల్లి, రామవరం, శ్రావణ్ షాట్, గరిపేట, పెనగడప, తిప్పనపల్లి, సీతాయిగూడెం, జూలూరుపాడు మండలంలోని సూరారం సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. వీటికి డివిజనల్ ప్లాంటేషన్ మేనేజర్‌గా తాడి రాజేందర్ పని చేస్తున్నారు.

‘టన్నుకు’ లంచం
2002–03 సంవత్సరానికి సంబంధించి సుమారు 3,900 ఎకరాల్లో జామాయిల్ కటింగ్కు టెండర్లు పిలిచారు. కొత్తగూడెం ప్రాంతంలో ఎనిమిది యూనిట్లకు గాను జామాయిల్ కటింగ్, రవాణా పనులకు మొత్తం రూ.2.90 కోట్లకు ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే టెండర్ పొందిన కాంట్రాక్టర్ నుంచి టన్నుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనుల్లో అనేక ఆంక్షలు, అడ్డంకులు పెట్టడంతో చివరికి టన్నుకు రూ.90కి బేరం కుదిరినట్లు తెలుస్తోంది. తొలి విడతగా రూ.3.50 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదరగా, ఆ నగదును ఒక వ్యక్తి ద్వారా సీతాయిగూడెంకు పంపించారు.

నగదు ఎవరికివ్వాలో తెలియక… ఏసీబీకి సమాచారం
నగదు తీసుకొచ్చిన వ్యక్తికి ఎవరికి ఇవ్వాలో స్పష్టత లేకపోవడంతో, సీతాయిగూడెంలో కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్‌గా పని చేస్తున్న గోపాలకృష్ణకు అప్పగించినట్లు సమాచారం. ఈలోగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు గోపాలకృష్ణ వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో జరిగిన మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, సూపర్వైజర్ గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
చిన్న చేపలే పట్టుబడ్డాయి… తిమింగలం సంగతేంటి?
ఏసీబీ దాడుల్లో ప్లాంటేషన్ మేనేజర్, సూపర్వైజర్‌లను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి ప్రధాన కారణమని చెప్పబడుతున్న డివిజనల్ మేనేజర్ శ్రీవాణిని ఇప్పటివరకు రిమాండ్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ సీతాయిగూడెం ప్రాంతానికి చెందిన సూపర్వైజర్ గోపాలకృష్ణ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీతాయిగూడెం పంచాయతీ నాలుగో వార్డు మెంబర్‌గా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందారు. గెలుపు సంబరాలు ముగియకముందే ఏసీబీ వలకు చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఈ కేసులో నిజంగా తిమింగలాలు బయటపడతాయా? లేక కథ ఇక్కడితో ముగుస్తుందా? అన్నది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.


