చేర్యాల పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి
చైర్‌పర్సన్‌గా ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా మెడిశెట్టి ఉమ ఖరారు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ
ఎస్సీ మహిళా రిజర్వేషన్లో చైర్‌పర్సన్‌గా అరుణ ఎంపిక
వైస్ చైర్మన్ పదవికి మెడిశెట్టి ఉమ పేరు ఖరారు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారిక ప్రకటన
మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్‌కు 5 స్థానాలు
నేడు ప్రమాణ స్వీకారం అనంతరం అధికారిక ఎన్నిక ప్రక్రియ
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో మున్సిపల్ పీఠం ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా 6వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా 10వ వార్డు కౌన్సిలర్ మెడిశెట్టి ఉమ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ తరఫున ఈ రెండు కీలక పదవులకు అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటించినట్లు తెలిసింది. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటగిరీలో చైర్పర్సన్ పదవి ఉండటంతో ముస్త్యాల అరుణను ఎంపిక చేశారు. అలాగే పార్టీ బలాబలాలను, స్థానిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వైస్ చైర్మన్ పదవికి మెడిశెట్టి ఉమను ఎంపిక చేశారు.
బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం
చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో చైర్పర్సన్ ఎన్నిక బీఆర్ఎస్కు లాంఛనప్రాయంగా మారింది. పార్టీ నిర్ణయం ప్రకారం ఎంపికైన అభ్యర్థులు అధికారికంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
నేడు ప్రమాణ స్వీకారం… అధికారిక ఎన్నిక
ఎన్నికైన 12 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కోసం చేర్యాల పాత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనంగా పూర్తికానుంది.


