ఢిల్లీని వణికించిన ఉద్యమం
మహోన్నత ఘట్టం సాక్షాత్కరించిన రోజు డిసెంబర్ 9
తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో!’ నినాదంతో ఉధృతం
పార్లమెంట్ వేదికగా తెలంగాణ బిల్లు కోసం పోరాడం
అమరుల త్యాగాలను తరతరాలకు తెలియజేయాలి
డిసెంబర్ 9 ‘విజయ్ దివాస్’ను ఘనంగా నిర్వహించాలి
: పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పిలుపు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివాస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, అమరుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తుచేయాలని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పార్టీ శ్రేణులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అనేక దశల్లో జరిగిన ఉద్యమంలో భాగంగా, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలనే తుది సంకల్పంతో కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలించిన మహోన్నత ఘట్టం సాక్షత్కరించిన రోజు డిసెంబర్ 9 అని నామ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగిందని నాటి తెలంగాణ పోరాటాన్ని, అమరుల త్యాగాలను నామ స్మరించుకున్నారు.
సంకల్పానికి ఊపిరి పోసిన నాయకుడు కేసీఆర్
“తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా ఉప్పొంగించిన ఘనత కేసీఆర్‌దేనని నామ పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి, నిమ్స్ ఆస్పత్రిలో చావు–బతుకుల మధ్య ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన సంకల్పాన్ని ఊపిరి పోస్తూ ముందుకు నడిపిన నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. నాడు పదిహేనవ లోక్‌సభలో తాను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, తెలంగాణ రైతు బిడ్డగా పార్లమెంట్‌లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్వయంగా కేసీఆర్ దీక్ష అంశాన్ని లేవనెత్తి సభలో చర్చకు తీసుకురావాలని పోరాడానన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సహచర సభ్యుడు, ఒక ఉద్యమ నాయకుడు ఆమరణ నిరాహార దీక్షలో ఉండి చావు–బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్నారని, ఆ దీక్షను విరమింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆ సమావేశంలో తాను స్పష్టంగా చెప్పానన్నారు. తాను వ్యక్తం చేసిన అభిప్రాయానికి అన్ని పార్టీల వారు మద్దతు తెలిపారని, నాడు బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించారన్నారు. దీక్షలో ఉన్న కేసీఆర్ పరిస్థితిని పార్లమెంట్ వేదికపై గట్టిగా ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నిరంతరం గళమెత్తామని తెలిపారు. అంతేకాకుండా స్పీకర్ ఫార్మాట్‌లో తాను, కేసీఆర్ ఇద్దరం కూడా రాజీనామా పత్రాలు సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా నామ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో గళమెత్తి, సభను స్థంభింపజేసిన రోజులవని తెలియజేసారు. ఆ పోరాటాల ఫలితంగానే తెలంగాణ బిల్లు ముందుకు వచ్చి రాష్ట్ర ఆవిర్భావానికి దారి తీసిందని స్పష్టం చేశారు.
తెలంగాణ చరిత్రను తరతరాలకు గుర్తు చేయాలి .. తెలంగాణ రైతు బిడ్డగా బిల్లు పై తొలి ఓటు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, ఉద్యోగులు నిరంతరం తమ వాణి వినిపించారన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం ఉప్పొంగి, ఢిల్లీ మెడలు వంచి చివరికి తెలంగాణ సాధించామన్నారు, తెలంగాణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వేళ స్వరాష్ట్రం కోసం తెలంగాణ రైతు బిడ్డగా తానే తొలి ఓటు వేసిన విషయాన్ని నామ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చారని, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం నేటి తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువరాదన్నారు. అందుకే డిసెంబర్ 9 ‘విజయ్ దివాస్’ను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించి ఉద్యమ చరిత్రను ప్రజలకు గుర్తు చేయాలని నామ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


