- రోడ్డు పక్కన డబ్బా దుకాణాలు ఏర్పాటు
- వాటిని కిరాయికి ఇస్తున్న కబ్జాకోరులు
- బాబు క్యాంప్ ఏరియాలో ఇష్టారీతిన ఆక్రమణలు
- చోద్యం చూస్తున్న అధికారులు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని బాబు క్యాంప్ ప్రాంతంల్లో భూకబ్జాల పర్వం ఎక్కువైంది. ముఖ్యంగా డ్రైనేజీలపై చిన్న చిన్న బడ్డీ దుకాణాలను ఏర్పాటు చేస్తూ వాటిని కొందరు అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బడ్డీ దుకాణాల వల్ల డ్రైనేజీలు శుభ్రం చేయడం ఇబ్బందికరంగా మారిందని పలువురు వాపోతున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగుల క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఇటీవల కూల్చివేశారు.
అనంతరం వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసినా కొందరు కబ్జాదారులు ఫెన్సింగ్ ముందే చిన్న చిన్న రేకుల డబ్బా దుకాణాలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ దుకాణాలను వెంటనే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకనే జిల్లా పరిషత్ ఖాళీ స్థలాల ముందు బడ్డీ దుకాణాలు పెట్టి వ్యాపారం చేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలపై ఏర్పాటుచేసిన రేకుల బడ్డీ దుకాణాలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు వెంటనే వాటిని ఆక్రమించి నిర్మాణాల చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, డబ్బాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ స్థలాల ముందు హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


