బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!
మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం
దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం
ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యం – రేగా కాంతారావు మండిపాటు
కాకతీయ, మణుగూరు : సింగరేణి బొగ్గు లారీలు, ఇసుక లారీల అతి రవాణా కారణంగా మణుగూరు–బయ్యారం రహదారి పూర్తిగా ధ్వంసమైందని పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మణుగూరు–బయ్యారం రహదారిపై దుమ్ము, ధూళి మబ్బుల్లా ఎగసిపడుతున్నాయని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అదుపు లేని లారీ రవాణా వల్ల నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గిరిజన పిల్లల ఆరోగ్యానికి ముప్పు విపరీతమైన ధూళి కారణంగా గిరిజన బిడ్డలు శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులతో మంచం పడుతున్నారని రేగా ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మణుగూరు–బయ్యారం మార్గం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాభాలకే ప్రాధాన్యం?
రోడ్ల మరమ్మతులు పట్టించుకోకుండా కేవలం ఇసుక అక్రమ రవాణా, లాభాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు మించిన లాభాలు ఏమిటని ప్రశ్నించారు. రవాణా నియంత్రణ లేకుండా భారీ లారీలు నిత్యం సంచరిస్తుండటంతో రహదారులు గుంతలమయంగా మారాయని పేర్కొన్నారు.
ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని, లారీ రవాణాపై నియంత్రణ విధించాలని, ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాలని రేగా కాంతారావు డిమాండ్ చేశారు.


