- స్నేహం ముసుగులో వ్యక్తి దారుణ హత్య
- డబ్బు, నగల కోసం కిరాతకం
- యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి ఫ్రెండ్ మర్డర్‌కు ప్లాన్
- ఖమ్మం హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు..
- వివరాలు వెల్లడించిన ఏసీపీ తిరుపతిరెడ్డి
కాకతీయ, ఖమ్మం రూరల్: స్నేహం మూసుగులో ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి బుధవారం తన కార్యాలయంలో హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఎం ఫార్మసీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తన స్వగ్రామమైన చిట్యాలలో వంగ తోట సాగు చేయడానికి కొంతమంది వద్ద అప్పు తీసుకున్నారు. పంట నష్టం రావడంతో ఖమ్మంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన కొమ్ము నగ్మాతో పరిచయమై అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ముళ్ల పొదల్లో శరీర భాగాలు..
కామేపల్లి మండలం కెప్టెన్ బంజారకు చెందిన స్నేహితుడు గట్ల వెంకటేశ్వర్లు అశోక్‌కు అప్పుడప్పుడు అవసరాలకు డబ్బులు ఇచ్చేవాడు. అశోక్, వెంకటేశ్వర్లు మధ్య స్వలింగ సంపర్క బంధం ఏర్పడింది. ఈక్రమంలోనే వెంకటేశ్వర్లు వద్ద ఉన్న బంగారం, డబ్బులపై అశోక్ కన్నుపడింది. ఎలాగైనా కాజేయాలని పథకం పన్ని వెంకటేశ్వర్లు మర్డర్‌కు ప్లాన్ చేశాడు. ఇందుకోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి హత్య గురించి తెలుసుకున్నాడు. మర్డర్ కోసం గత నెల 15న కత్తులు తెచ్చి పెట్టుకున్నాడు. అదే రోజు వెంకటేశ్వర్లు రాత్రి 8:30 గంటలకు అశోక్ రూంకి వచ్చి పడుకున్నాడు.
16న తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో బయట కాపలా గా నగ్మాను ఉంచి కత్తితో వెంకటేశ్వర్లు మెడపై అనేక సార్లు నరకడంతోపాటు మొండెం, తలకాయ వేరు చేసి శరీరంలోని భాగాలను ముక్కలుగా చేసి కవర్లలో పెట్టి దుప్పట్లో చుట్టి బండిపై వచ్చి ఖమ్మంలోని కరుణగిరి సమీపంలో ముళ్ళ పొదలో వేశాడు. తర్వాత తన రూంలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్సై సాయికుమార్, కారేపల్లి ఎస్సై గోపి, కానిస్టేబుల్స్ అంజి, ఆనంద్, సంపత్, రాజేష్ ను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు.


