రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు
కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన శెట్టే మల్లయ్య -సుగుణవ్వ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు వారి నివాసంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు శనివారం గ్రామ పరిధిలో నుంచి ఊరేగింపుగా పుట్టబంగారం తీసుకువచ్చారు. ఆదివారం శివసత్తుల పూనకాలతో పట్నాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అనంతరం మల్లికార్జున స్వామికి వివాహం జరిపించారు. కళ్యాణమహోత్సవాన్ని తిలకించెందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కురుమలకు ఆరాధ్య కుల దైవమైన మల్లన్న స్వామికి కురుమలు నిత్యం పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఒగ్గు పూజారులే మల్లన్న స్వామికి పట్నాలు వేయడమనేది పురాతనం నుండి ఆనవాయితీగా వస్తోంది. కాగా గ్రామంలో శెట్టే మల్లయ్య -సుగుణవ్వ అంగరంగ వైభవంగా మల్లన్న పట్నాలు జరిపిస్తుండటంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. చేర్యాల పట్టణానికి చెందిన ఒగ్గు పూజారుల నేతృత్వంలో ఆదివారం ఘనంగా పట్నాలు చెల్లించారు.



