252 జీవోను ప్రభుత్వం సవరించాలి
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కోతను మానుకోవాలి
భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
కాకతీయ, కొత్తగూడెం : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజాపాలన పేరుతో పాత్రికేయులను శిక్షించే ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే–టీజేఎఫ్ హెచ్143) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, జర్నలిస్టులను విభజించేలా ఉన్న 252 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కార్యదర్శి మహమ్మద్ షఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం రాజేష్, చండ్ర నరసింహారావు, వట్టి కొండ రవి మాట్లాడుతూ… “జర్నలిస్టులపై ఎందుకీ కక్ష? ప్రజా పాలన పేరుతో మాకెందుకు శిక్ష?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రిడేషన్ కార్డుల జారీలో కోత పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మిగిలే కోట్లెన్ని అని ప్రశ్నించారు.
252 జీవోతో జర్నలిస్టులకు అన్యాయం
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రిడేషన్ జీవో జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేలా ఉందని నాయకులు విమర్శించారు. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయడం అన్యాయమన్నారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు కూడా జర్నలిస్టులకు అమలు చేయాలని కోరారు. 252 జీవో సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.
అల్లం నారాయణ హయాంలో జర్నలిస్టులకు భరోసా
గత ప్రభుత్వ హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ ఉన్న సమయంలో జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరిగిందని యూనియన్ నాయకులు గుర్తుచేశారు. కరోనా సమయంలో బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సాయం, మృతి చెందిన జర్నలిస్టుల పిల్లల చదువులకు సహకారం అందించారని తెలిపారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో అక్రిడేషన్ కార్డులు జారీ చేయించిన ఘనత అల్లం నారాయణదేనని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


