స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం
◆ నియమావళి ఉల్లంఘనకు తావులేదు
◆ 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
◆ విధివిధానాలపై ప్రత్యేక అవగాహన
◆ ఘర్షణలకు అవకాశం లేకుండా చర్యలు:
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఎన్నికల బందోబస్తు విధులకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు, విధివిధానాలు, ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియంత్రణలో పూర్తి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళిపై ప్రతి పోలీస్ సిబ్బంది సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు.
కఠినంగా శాంతిభద్రతల పరిరక్షణ
శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టులు, రూట్ మొబైల్ పార్టీలు నిర్వహించే విధులపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన విధులపై స్పష్టతతో పనిచేయాలన్నారు.
అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు
పోలింగ్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో మొత్తం 11 వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
బందోబస్తు విధుల్లో 4 మంది అడిషనల్ డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏసీపీలు తిరుపతి రెడ్డి, నర్సయ్యతో పాటు రూరల్ డివిజన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.


