కాకతీయ, నేషనల్ డెస్క్: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు కేంద్రంలోకి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు ఆగస్టు 19వ తేదీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు ఉద్దేశించింది. ఈ బిల్లు బుధవారం లోకసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ మోసాలు పెరుగుతుండటంతో దర్యాప్తు సంస్థలు ఈ యాప్స్ ను ప్రచారం చేసే ప్రముఖులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ ను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. దీనిపై బుధవారం లోకసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ బిల్లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించే చర్యలకు జరిమానా, శిక్షలను కూడా కలిగి ఉందని వార్తలు చెబుతున్నాయి. ఈ దీపావళికి ఆన్ లైన్ గేమింగ్ పై 40శాతం జీఎస్టీ విధించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఆన్ లైన్ గేమింగ్ ను నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం గతంలో చేపట్టిన చర్యలు ఆన్ లైన్ గేమింగ్ ద్వారా డబ్బు ఇస్తామని చెప్పి ఆర్థిక మోసాలకు, కొన్ని సందర్భాల్లో నేరాలకు దారితీస్తున్న యాప్స్ ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో కేంద్రం ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫారమ్ లతో సహా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు ఆర్థిక లావాదేవీలు, వినియోగదారుల డేటా భద్రతను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంది.
ఆన్ లైన్ గేమింగ్ రంగంలో ఆదాయపు పన్నును కచ్చితంగా విధించే లక్ష్యంతో ఫైనాన్స్ చట్టం 2023 ద్వారా ఆన్ లైన్ ఆటలతో వచ్చిన నికర లాభాలపై 30శాతం టాక్స్ ను అసెస్ మెంట్ ఏడాది 2024-25 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో పాటు అక్టోబర్ 1, 2023 నుంచి ఆన్ లైన్ గేమింగ్ పై 28శాతం జీఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


