విత్తన చట్టం’లోపాలు సరిచేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సెక్రటేరియట్ లో తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం-2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమావేశం అయ్యారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా చట్టం విధివిధానాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరం అని, వ్యవసాయం ఉద్యానవనంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడం వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని తెలిపారు. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 అమలులో పలు లోపాలు ఉండటంతో విత్తన సంస్థలు చట్టంలోని బలహీనతను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొన్నారు. దానిని అధిగమించేందుకు వీలుగా డ్రాఫ్ట్ కమిటీ వేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ప్రతిస్పందిస్తూ ప్రస్తుత విత్తన చట్టాల వివరాలు, వాటిలో ఉన్న లోపాలు, తద్వారా రైతులు ఏవిధంగా నష్టపోతున్నారు అనే వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విత్తన చట్టం, 1966 ముసాయిదా తెలంగాణలో విత్తన ఉత్పత్తికి సంబంధించి తయారు చేయడం జరిగిందని అన్నారు.
ఇందులో ప్రధానంగా విత్తన రైతుల హక్కులు, సంక్షేమం కాపాడడం, రైతు-కంపెనీ ఒప్పందాల్లో న్యాయం, నాసిరకం విత్తనాల వల్ల నష్టం కలిగిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టం చేశారన్నారు. అదేవిధంగా పారదర్శకత, బాధ్యత, నియంత్రణలను బలోపేతం చేయడం, సాంప్రదాయ విత్తనాల పరిరక్షణ, నిల్వ ప్రోత్సాహం వంటి అంశాలను చేర్చిరని వివరించారు. చట్టంలో మొత్తం 8 అధ్యాయాలు, 32 సెక్షన్లు పొందుపర్చినట్లు తెలియజేశారు. విత్తనోత్పత్తికి సంబంధించి ఒక సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు చేయడం, విత్తన ఉత్పత్తి నియంత్రణ, పర్యవేక్షణ , వివాద పరిష్కారాలు ఇందులో పొందుపరచారని తెలిపారు. అంతేగాక విత్తన రైతుల సంక్షేమం కోసం విత్తన రైతులకు క్రెడిట్ పెంచి ఇవ్వడం, విత్తనోత్పత్తిపై సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం, సీడ్ కో ఆపరేటివ్ లు కమ్యూటీ సీడ్ బ్యాంకులకు ఆర్థిక సహాయం లాంటి విషయాలు కూడా పొందుపర్చారని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, అడ్వకేట్ సునీల్ కుమార్, సీడ్ డైరెక్టర్ ఎం.వి. నగేష్ కుమార్, ఈడీ రామాంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, పాలసీ నిపుణులు డి. నరసింహారెడ్డి, కె. శివ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.



