- సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
- గుండాల మాజీ జెడ్పిటిసి వాగబోయిన రామక్క, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం
- సాధించిన అభివృద్ధి పుస్తకం ఆవిష్కరణ
కాకతీయ, గుండాల : 2019లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ తరపున జెడ్పిటిసిగా వాగబోయిన రామక్క, ఎంపీపీగా ముక్తి సత్యంను గుండాల మండల ప్రజానీకం అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పుడు వారిని ఓడించడానికి పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేసినా వాటిని ప్రజలు తిప్పికొట్టారని ఎన్డీ నాయకులు అన్నారు. మండల ఓటర్లు చైతన్య యుతమైన పాత్రను పోషించారన్నారు. రామక్క, ముక్తి సత్యం లను గెలిపించాక వీరు ప్రజా అభివృద్ధే ధ్యేయంగా సాధించిన ఫలితాలను బుక్లెట్ రూపంలో సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం గుండాల మండలకేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల నాయకుడు యాసారపు వెంకన్న అధ్యక్షతన వహించారు.
ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, మాజీ జడ్పిటిసి వాగబోయిన రామక్క, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు కోరం సీతారాములు, మండల కార్యదర్శి అరెం నరేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి హాజరై మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు ఇచ్చిన అధికారం, అందించిన సహకారంతో చేసిన అభివృద్ధి వివరాలను ఈ పుస్తక రూపంలో ముందుకు తెచ్చామన్నారు. భూమిలేని పేదలందరికీ న్యూ డెమోక్రసీ నరికించిన భూములను పాలకులు బలవంతంగా గుంజుకునేందుకు ప్రయత్నిస్తే పార్టీ తెగించి కొట్లాడిందని అన్నారు. కామ్రేడ్ లింగన్న, బాటన్న, కోటన్న ఈ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యూడెమోక్రసీ అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ గుండాల మండల కార్యదర్శి అరెం నరేష్, బచ్చలి సారయ్య, ఈసం కృష్ణ, మల్లేశం, మంగన్న, గడ్డం లాలయ్య తదితరులు పాల్గొన్నారు.


