ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులే..
సీపీఐ అభ్యర్థులను గెలిపించండి
అధికారం ఉన్నా.. లేకున్నా నిత్యం ప్రజల వెంటే..
కొత్తగూడెంను కార్పొరేషన్‌గా మార్చిన ఘనత మాదే
సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ
కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఆపార్టీ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శనివారం రామవరంలోని 6 డివిజన్లు, బర్మా క్యాంపు, వ్యూన్ బస్తీ, పాత కొత్తగూడెం ఏరియాల్లోని డివిజన్లలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషాతో కలిసి రోడ్లు, బస్తీ కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎర్రజెండాలతో ఎదురేగి పెద్దఎత్తున హారతులు పట్టారు. ఈసందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారానే పాల్వంచతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని ఓటర్లకు గుర్తు చేశారు. మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరగని పాల్వంచకు ఎన్నికలు జరిపించడమే కాకుండా కొత్తగూడెంను కార్పొరేషన్‌గా మార్చిన ఘనత సీపీఐదే అన్నారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా.. లేకున్నా పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకుల వెంట ఉంటూ వారి సమస్యల కోసం రాజీలేని పోరాటాలు చేస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచిన నాటి నుండి ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయని. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యుర్థుల విజయం అవసరమని తద్వారా అవినీతి రహిత పాలన ప్రజలకు అందుతుందన్నారు.

వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల వేళ ఊరు, పేరు, అడ్రస్ లేని గుంట నక్కలు ఓట్ల కోసం వస్తున్నాయని అలాంటి వారి వట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి అహంకారానికి నడుమ సాగుతున్నాయని ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికలు పూర్తయిన తర్వాత ముఖం చాటేస్తారని కానీ నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులను గెలిపించుకుంటే అన్ని విధాలా బాగుంటుందన్నారు. స్థానిక సీపీఐ నేతలే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మనతో నిత్యం ఉండే వారిని గెలిపించుకోవడం అంటే మనల్ని మనం గెలిపించుకున్నట్లే అన్నారు. అధికారం ఎటుంటే ఆ పార్టీ కండువాలు కప్పుకునే వారికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అధికారం లేని రోజుల్లో ఈ నాయకులుగా చెప్పుకునే వారు ఏ నాడైనా ప్రజలతో మమేకమయ్యారా అని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ… కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ ప్రజా సంఘాల పోరాటం సత్ఫలితం దిశగా దూసుకుపోతుందని ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి ఎర్ర జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. సిపిఐ అభ్యర్థుల కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయడం ద్వారా అవినీతిని తావులేకుండా చేసిన వారవుతారని చెప్పారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, నలిగంటి శ్రీనివాసరావు, దుర్గరాశి వెంకటేశ్వర్లు, ఎస్కే ఫహీమ్, వీరస్వామి, వాసిరెడ్డి మురళీ, ఉదయ్ భాస్కర్, కందుల భాస్కర్, జిల్లా సమితి సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శాంతిశ్రీ, నాయకులు వాకపల్లి హరినాధ్, గోపి కృష్ణ, జహీర్, ఉల్లోజు వెంకట్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జక్కుల గట్టయ్య, కిరణ్, భవాని, నగేష్, కిలార్ ప్రసాద్ పాటు అభ్యర్ధులు భూక్య శ్రీనివాస్, మునిగడవ పద్మ, కంచర్ల హిమశ్రీ, ఎర్రబెల్లి శంకర్, కనుకుంట్ల సాహితి, కూరపాటి సుధాకర్, పోలమూరి ధనలక్ష్మీ, ఇందిరా ప్రియదర్శిని, వడాల ఆకాంక్ష, మండ నాగలక్ష్మీ, కోలావూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.


