కాకతీయ, పినపాక : తెలంగాణ రైతులకు యూరియా బస్తాలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, యూరియా బస్తాల కోటా తగ్గించి రైతులను ఇబ్బందికి గురి చేస్తుందన్నారు.
పండించిన పంటలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నెలల తరబడి నిర్లక్ష్యం చేయగా నేడు ఎరువుల కొరతతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని మండిపడ్డారు. రైతన్నలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గాడి తప్పి రైతులను, పేద ప్రజలను ఇబ్బంది గురి చేస్తుందన్నారు. సహకార సంఘం కార్యాలయాల వద్ద రైతులు చెప్పులు పెట్టి వేచి చూడే పరిస్థితి లైన్ లో ఉందన్నారు.
సమయానికి పంట పొలాలకు ఎరువులు యూరియా వెళ్లకపోతే రైతులకు తీవ్ర నష్టాలు వస్తాయని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఎరువులు, యూరియా, విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పోరాటాల నిర్వహిస్తామని తెలిపారు


