- బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ డిమాండ్
ఖమ్మం, కాకతీయ ప్రతినిధి: ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో కాల్వ ఒడ్డున మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గుండాల (ఆర్జేసీ) కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం త్రీటౌన్‌లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వంతెన నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాకపోవడం శోచనీయమన్నారు. వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీగల వంతెన పూర్తి కాకపోవడంతో వాహనదారులు చుట్టూ తిరిగి కరుణగిరి వంతెన మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీని వల్ల కరుణగిరి వంతెనపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.
వరదలు తగ్గినప్పటికీ ఇప్పటివరకు మున్నేరుపై ప్రత్యామ్నాయ చెప్టా నిర్మించకపోవడం అధికారుల పనితీరును స్పష్టంగా చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్నేరుపై ప్రత్యామ్నాయ చెప్టాను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో త్రీటౌన్ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్‌రావు, పార్టీ నాయకులు కనకం భద్రయ్య, రుద్రగాని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


