- లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు
- పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కేయూ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 ప్రవేశాలు పొందిన ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ లో వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచి పేద విద్యార్థులపై భారాన్ని మోపిందని అన్నారు.
ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 80 ఉండగా ఇప్పుడు 1200 పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రికగ్నేషన్ ఫీజు గతంలో రూ. 400 ఉండగా ఇప్పుడు రూ. 8 వందలకు పెంచారన్నారు. ఐయూడీఎఫ్ ఫీజు గతంలో రూ.60 ఉండగా.. ఇప్పుడు 300.. ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో రూ. 50 ఉండగా ఇప్పుడు 200కు పెంచారన్నారు. గతంలో ఒక్కొ విద్యార్థి అన్ని రకాల ఫీజుల కింద రూ.1340 చెల్లించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు రూ.3,250కి పెంచారన్నారు. గతం కంటే ఒక్కో విద్యార్థిపై రూ.1910 ఫీజు భారం పడుతుందన్నారు. పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణమే ఫీజుల భారం తగ్గించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


