మహనీయుల ఆశయాలే మార్గదర్శకాలు
జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్
కాకతీయ, కొత్తగూడెం : మహనీయులు ప్రతిపాదించిన ఆశయాలు, సిద్ధాంతాలే సామాజిక న్యాయం సాధించేందుకు నిజమైన మార్గదర్శకాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం అధికారులు, సిబ్బంది కలిసి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తామని, సమానత్వం–న్యాయం కోసం కృషి చేస్తామని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


