ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి
250 గజాల భూమి, రూ.20 వేల పెన్షన్ అమలుపై డిమాండ్
సాంకేతిక లోపాల వల్ల అర్హులు బయటపడ్డారని ఆరోపణ
కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం సమర్పణ
కాకతీయ, కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి కేటాయింపు, నెలకు రూ.20 వేల పెన్షన్ వంటి హామీల అమలులో మరోసారి దరఖాస్తు అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు.ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల నమోదు కాని కేసులు, అప్లోడ్ కాని ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కేసులకు ప్రత్యేక ఎడిట్ అవకాశం కల్పించి అర్హులైన వారికి పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుర్తింపు ప్రక్రియలో లోపాల కారణంగా అనేక మంది ఉద్యమకారులు పథకాల నుంచి బయటపడ్డారని ఆరోపించారు.కరీంనగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో సమర్పించిన ఈ వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు ఫోరం నాయకులు తెలిపారు.
ఉమ్మడి జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి కాళిదాసు రేణుక, నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి సాయికృష్ణ, మహిళా అధ్యక్షురాలు ఘర్షకుర్తి ఉమారాణి, ఉత్తర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కారుపాకల, రాష్ట్ర అధికార ప్రతినిధి జంగాపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు రెడ్డవేని తిరుపతి, నాయకులు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


