తుని కేసులో సంచలనం..
బాలికపై అత్యాచారయత్నం చేసిన తాటిక నారాయణ ఆత్మహత్య
మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తుండగా పాస్ కోసమంటూ వాహనం ఆపిన పోలీసులు
చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు
మృతదేహం కోసం పోలీసుల గాలింపు
కాకతీయ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని కేసులో సంచలనం చోటుచేసుకుంది. బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక విచారణ అనంతరం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లేందుకు వెళ్తుండగా మధ్యలో పాస్ కోసమంటూ వాహనం దిగిన నారాయణరావు చెరువులో దూకేసాడు. ఈసంఘటన బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో జరిగింది. రాత్రి కావడంతో చెరువులో గాలింపు చర్యలు సాధ్యం కాలేదు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ శ్రీహరిరాజు పరిశీలిస్తున్నారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ
జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బాలికకు తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయమాటలు చెప్పి.. ఆ బాలికను స్కూల్ నుంచి స్కూటిపై ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు టీడీపీ నేత తాటిక నారాయణరావు. అయితే నారాయణరావును తెలియకుండా ఓ వ్యక్తి అతన్ని ఫాలో అవుతూ వీడియో తీశాడు. దీంతో ఇంతంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో తీస్తూ ఉండగా బాలిక దుస్తులు వేసుకుంటూ ఉండగా ఆ బాలికను ఏం చేశావ్ అంటూ టీడీపీ నేతను వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ ఆ బాలికను బైక్ పై ఎక్కించుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురుకుల పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపట్టారు. అయితే నారాయణరావు ఇప్పటికే నాలుగైదు సార్లు బాలికను బంధువులంటూ బయటికి తీసుకెళ్లాడని హాస్టల్ వర్గాలు విచారణలో వెల్లడించాయి. దీంతో బాలికకు న్యాయం చేయాలంటూ గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు బాలిక కుటుంబసభ్యులు. అయితే కేసును రాజకీయ కోణంలో తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ రూరల్ ఎస్ఐ తో బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు . ఈ కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. తాటిక నారాయణరావుకు బడిత పూజ చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


