తెలంగాణకు గుండు సున్నా
బడ్జెట్ లో రాష్ట్రం పై కేంద్రం వివక్షత
కేంద్రం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
కాకతీయ, రఘునాథపాలెం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నిరాశను మిగిల్చిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయల పన్నులు కడుతున్న తెలంగాణకు కేంద్రం ఈసారి కూడా గుండు సున్నా ఇచ్చిందని ఆయన ఘాటుగా విమర్శించారు.
కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందని, ప్రత్యేక ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, పరిశ్రమల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు ఇవ్వడంలో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందన్నారు.
ఈసారి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేటాయించకుండా రాజకీయ కక్షతో వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వివక్షాత్మక ధోరణిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా సాధించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పోరాటం కొనసాగిస్తారని రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


