ఖాతాదారులకు అండగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్
టీజీబీవీ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ అనుదీప్
కాకతీయ , కూసుమంచి : ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండగా నిలుస్తోందని పాలేరు బ్రాంచ్ ఫీల్డ్ ఆఫిసర్ ఎస్ అనుదీప్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో నిర్వ హించిన ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా, జీవన జ్యోతి పథకాలకు అర్హులైన ఖాతాదారులు తప్పక దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణాలు, రైతులకు రుణాలు అందించడంలో పాలేరు శాఖ ముందంజలో ఉందన్నారు. అపరిచిత వ్యక్తులకు ఆధార్ ఓటీపీ, ఇతర ఓటీపీలు చెప్పి మోసపోవద్దన్నారు. డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఖాతాదారులకు అవగాహన కలిగేలా కళాజాత బృందం ఆట పాటలతో అలరించారు. కార్యక్రమంలో బ్యాంక్ మిత్ర కందాల నాగేంద్ర, సర్పంచ్ మక్కరామకృష్ణ, మాజీ సర్పంచ్ కందాల రవి, సిబ్బంది రాములు , డ్వాక్ర సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


