కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు-2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లకు సభ వాయిస్ ఓటు ద్వారా మద్దతు తెలిపింది. ఈ బిల్లుల ద్వారా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇంతవరకు అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం ద్వారా మరింత పెద్దఎత్తున బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడింది.
చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద అడ్డంకిగా వ్యవహరించిందని విమర్శించారు. 2018లో పంచాయతీరాజ్ చట్టం, 2019లో మున్సిపాలిటీ చట్టం ద్వారా బీఆర్ఎస్ రిజర్వేషన్ పరిమితిని 50 శాతం వద్దే నిలిపేసిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం బీసీ హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తోందని, ఇప్పటికే హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం కులగణన సర్వే నిర్వహించామని, దాని ఆధారంగానే మార్చిలో రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపించామని సీఎం స్పష్టం చేశారు. కానీ అవి రాష్ట్రపతి వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ప్రతిపక్షం తరఫున బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వంపై నిజాయితీ లోపించిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను సాధించడంలో కేంద్రం ముందు ఏకగ్రీవంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విమర్శలకు సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటనల సందర్భంగా ప్రధానమంత్రిని కలవడానికి ఐదుసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని, బీజేపీ నేతలు కూడా సహకరించడం లేదని తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఈ సవరణ బిల్లులు బీసీ వర్గాల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించి, గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వారి ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు.


