సీపీఎం నుంచి తమ్మినేని బహిష్కరణ
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు
మున్సిపల్ ఎన్నికల్లో వ్యతిరేక చర్యలపై వేటు
కాకతీయ, కూసుమంచి: పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన తమ్మినేని కోటేశ్వరరావును సీపీఎం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఖమ్మం రూరల్ మండల పార్టీ కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీకి సంబంధించిన అంశాల్లో కోటేశ్వరరావు చేసిన చర్యలు తీవ్ర నష్టం కలిగించాయని, గతంలో పలుమార్లు అంతర్గతంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పార్టీ అనేక అవకాశాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. ఇటీవల ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో కుమ్మక్కై తన భార్య అభ్యర్థిత్వాన్ని ఉపసంహరింపజేసి, ప్రత్యర్థి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించారని తెలిపారు. అదేవిధంగా తెల్దారుపల్లిలో మిగతా ఇద్దరు పార్టీ అభ్యర్థులను కూడా పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో కఠిన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని, పార్టీ నిర్ణయానికి మద్దతుగా నిలవాలని మండల కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.


