అథ్లెటిక్స్ మీట్‌లో కొత్తగూడెం క్రీడాకారుల ప్రతిభ
అభినందించిన కోచింగ్ సభ్యులు
కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు
ఈ నెల హైదరాబాద్ జింఖానా స్టేడియంలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు. ప్రతిభ చూపిన కొత్తగూడెం క్రీడాకారులను ఈ సందర్భంగా శనివారం క్రీడా కోచ్ లు అభినందించారు.
తమ ప్రతిభతో ముందుకు సాగుతున్న ఈ క్రీడాకారులు ఈ నెల 26 నుండి డిసెంబర్ 31 వరకు హర్యానా రాష్ట్రంలోని భీమ్ స్టేడియం భీవానిలో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక అయినట్లుగా పేర్కొన్నారు.
వీరందరికీ జిల్లా యువజన క్రీడా కార్యాలయం అధికారి పరంధాం రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాతీయ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతిష్టను పెంచాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఈటి అరుణకుమారి, కోచ్ లు డి.మల్లికార్జునరావు, సుష్మా బాయి తదితరులు పాల్గొన్నారు.


