ప్రభుత్వ పథకాలు వినియోగించుకోండి
యువతకు సర్పంచ్ కుంజా శ్రావణ్ కుమార్ సూచన
పగిడేరు గ్రామంలో ఏటీసీ పోస్టర్ల ఆవిష్కరణ
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాల భరోసా
జూలై నుంచి ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలు
కాకతీయ,మణుగూరు : ప్రభుత్వం యువత కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పగిడేరు సర్పంచ్ కుంజా శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పగిడేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఏటీసీ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కోసం పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, మెకానికల్ మెయింటెనెన్స్ కోర్సులకు మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఐటీఐల్లో అందుబాటులో ఉన్న ఇతర కోర్సులకు జూలై నెల నుంచి ప్రవేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తక్కువ కాలంలో పూర్తయ్యే ఈ కోర్సులు యువతకు ఉద్యోగావకాశాల దిశగా మార్గం చూపుతాయని వివరించారు. సమయాన్ని వృథా చేయకుండా యువత ఇటువంటి శిక్షణా కార్యక్రమాల్లో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఐటీఐ, ఏటీసీ సిబ్బంది మయ్య శ్రీనివాసరావు, చైతన్య, నూతన శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


