- సీపీఎం ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై. విక్రమ్
కాకతీయ, ఖమ్మం టౌన్: జిల్లాకేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.9 కోట్లు విడుదలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై.విక్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు పటేల్ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో క్రీడాకారులకు తగిన నైపుణ్యం పెరగటానికి నిధులు విడుదల చేశారని, ఖమ్మం పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు.
పెద్ద ఎత్తున విడుదల చేసినా ట్రాక్ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. నత్తనడకన పనులు కొనసాగటంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో కూడా రెండు కోట్లతో చేపట్టిన పనుల్లో దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పటేల్ స్టేడియం ట్రాక్ నిధులపై, జరిగిన పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్, మేయర్, అధికారులు జరుగుతున్న పనుల నాణ్యతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కె. మీరా సాహిబ్, దొంగల తిరుపతిరావు, ఎస్ నవీన్ రెడ్డి, పి రమ్య, యర్రా రంజిత్, జె వెంకన్న బాబు, గాలి వెంకట్రాది, పోతురాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


