- రాష్ట్ర వినియోగదారుల ఫోరం కీలక తీర్పు
- బాధిత రైతు కుటుంబానికి ఊరట
కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు కొలిపాక యాదమ్మకు మూడు సంవత్సరాల అనంతరం న్యాయం లభించింది. 2022 నవంబర్ 5న ఆమె మరణించగా, రైతు బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా సొమ్ము కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. అయితే బీమా పాలసీ బాండ్‌లో యాదమ్మ పుట్టిన తేదీ తప్పుగా నమోదు కావడంతో, ఆమె వయస్సు 60 సంవత్సరాలు దాటిందని పేర్కొంటూ బీమా సొమ్ము చెల్లింపును అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం హన్మకొండకు చెందిన యువ న్యాయవాది రాచకొండ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించింది.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రవీణ్‌కుమార్ 2023 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశారు. 2023 ఆగస్టులో ఫోరం తీర్పు ఇచ్చి, ఆధార్ కార్డు పుట్టిన తేదీని సరైనదిగా పరిగణిస్తూ రెండు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాది ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీల్ దాఖలు చేశారు. రాష్ట్ర ఫోరం అన్ని ఆధారాలను పరిశీలించి, 29 సెప్టెంబర్ 2025న కీలక తీర్పు ఇచ్చింది. రైతు కుటుంబానికి మొత్తం రూ.5 లక్షల బీమా సొమ్మును ఆరు వారాల్లోగా చెల్లించాలని, తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌ఐసీ, లింగంపల్లి గ్రామ ఏఈవోలను ప్రతి వాదులుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ విజయంపై న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. కొంత ఆలస్యమైనా రైతు కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా బీమా సొమ్ము కోల్పోయిన రైతాంగానికి న్యాయబాట చూపుతుంది. ఇలాంటి కేసుల్లో ప్రతి రైతు కోర్టును ఆశ్రయించవచ్చు అన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ అంతటా రైతులలో ఆనందం వెల్లివిరిసింది. రైతు బీమా సొమ్ము కోల్పోయిన అనేక కుటుంబాలకు ఇది శుభవార్తగా మారింది.


