నైపుణ్యతతోనే విజయాలు సొంతం
వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యతను పెంచుకుంటే జీవితంలో విజయాలు సొంతం అవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం, ఏదులాపురం మున్సిపాలిటీ పోలేపల్లి షిరిడి సాయినాథ్ నగర్ భద్రాద్రి కాలనీలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే ఉత్సవాలు జ్యోతి ప్రదర్శనతో ప్రారంభించబడ్డాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అత్యున్నత విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాలకు మంచి పేరు ఉందని, అడ్మిషన్ల కోసం ప్రతి సంవత్సరం అనేక దరఖాస్తులు వస్తాయని చెప్పారు. చిన్నతనంలో ఇలాంటి విద్యాసంస్థల్లో చదువుకోవడం తనకయ్యేదని, అందులో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే విజయం సాధించగలమని తెలిపారు. అయితే, విద్యార్థులు క్రీడలలో మరియు అకడమిక్స్‌లో సమాంతరంగా రాణించడం విశేషంగా సంతోషాన్నిచ్చిందని, దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కేంద్రీయ విద్యాలయాలు దోహదపడుతున్నాయని తెలిపారు. జీవితంలో విజయాల వెనుక పరిగెత్తకూడదని, ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యత పెంచుకుంటే విజయాలు ఆటోమాటిక్‌గా వస్తాయని కలెక్టర్ గూర్చి చెప్పారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు ఒక్కరోజులో గొప్పవారుగా కాకుండా, రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా నైపుణ్యతను పెంచి విజయం సాధించారని, వారి స్ఫూర్తి మనకు ప్రేరణనిచ్చేలా ఉందని చెప్పారు. కార్యక్రమంలో పీఎం శ్రీ కేంద్రీయ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్, టీచర్లు నసీరుద్దీన్ బాబా, సిహెచ్. నరేంద్ర కుమార్, అనిల్ భట్, తన్మాయి, ఊర్మిళ, విఖాష, మమత, త్రినేత్ర తదితరులు పాల్గొన్నారు.


