- వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- స్టోర్లో కాలం చెల్లిన వస్తువులపై కన్నెర్ర
- హాస్టల్ వార్డెనుకు షోకాజ్
- పలు ప్రాంతాల్లో తనిఖీలు
కాకతీయ, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులను, వంటశాలలను, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో కాలం చెల్లిన రవ్వ ఉండడంపై వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేయాలని డీటీడీవోను ఆదేశించారు. తాజా సరుకులను అందించాలని, హాస్టల్ పరిసరాలను శుభ్రతను పాటించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం పై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో రాసి వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, ప్రధానోపాధ్యులు రామ్ దాస్ , వార్డెన్ యాకుబ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వర్ధన్నపేట ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని సామూహిక ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతరం గేయం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అన్నారు. ప్రతిరోజూ పాఠశాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత భావాలు మరింత బలపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
సీహెచ్ సీ తనిఖీ..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని సీహెచ్ సీని జిల్లా కలెక్టర్ సత్య శారదా శుక్రవారం
ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు పరిశీలించారు. సమయ పాలన పాటించని పలువురు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను కలియతిరిగి రోగులతో మాట్లాడి వైద్యులకు తగు సూచనలు చేశారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రిని సందర్శించి రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహ స్వామి, డిసిహెచ్ డాక్టర్ రాం మూర్తి, తహసీల్దార్ విజయ్ సాగర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లంద ఏఎంసీ సందర్శించిన..
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఇళ్లంద వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు.
ప్యాడీ డ్రైయర్ ద్వారా ధాన్యం ఆరబెట్టే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మార్కెట్ యార్డ్ అధికారులతో, రైతులతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలనిఆదేశించారు.
పంటల నష్టం పరిశీలన..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షన్నపేట మండల కేంద్రంలో దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యక్షంగా పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని పూర్తిగా పారదర్శకంగా నమోదు చేయలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డీఎం సివిల్ సప్లైస్ సంధ్యారాణి, డీసీఎస్ ఓ కిష్టయ్య, తహసీల్దార్ విజయ్ సాగర్ వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


