నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు
అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పాకబండలో 33/11 కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
రూ.2.5 కోట్లతో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ
పలు కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని పాకబండ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2.5 కోట్ల నిధులతో పాకబండ వద్ద ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నామని, దీని ద్వారా చెరువు బజార్, హౌసింగ్ బోర్డ్, అల్లిపురం క్రాస్ రోడ్ ఐటీ హబ్ ఏరియా, రామచంద్రయ్య నగర్, అబ్దుల్ కలాం నగర్, పార్శీ బంధం తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
పనులు నాణ్యతతో పాటు సకాలంలో పూర్తవ్వాలి
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మనం చేపట్టే పనులు దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖమ్మం అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రతి రూపాయిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, ఖమ్మం అర్బన్ మండల తహసిల్దార్ సైదులు, కార్పొరేటర్లు, పలు శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


