చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన నిఘా
అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
భద్రాచలంలో విస్తృత తనిఖీలు
కాకతీయ, కొత్తగూడెం : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎంసీ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో ఉదయం నుంచి మూడు గంటలపాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొనగా, సుమారు 270 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక ట్రాలీని పోలీసులు సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా
అనంతరం కాలనీవాసులతో సమావేశమైన ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మట్కా, జూదం, కోడిపందాలు, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. తమ ప్రాంతాల్లో సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కాలనీల్లో కొత్తగా అద్దెకు వచ్చే వారి ఆధార్ కార్డు, చిరునామా వివరాలను ఇంటి యజమానులు తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో డయల్–100కు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రతి నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు తిరుపతి, స్వప్న, సతీష్, శ్యామ్, సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది సహా సుమారు 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


