నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలి
అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
రఘునాథపాలెంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ తనీఖీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం నుంచి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. రఘునాథపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చింతగుర్తి, గణేశ్వరం, రఘునాథపాలెం గ్రామాల నామినేషన్లు స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. దాఖలు చేసే నామినేషన్ ప్రతాలను పరిశీలించారు. ఎన్నికల విధులు, బాధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఏలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
విధులపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లాలోని 7 మండలాలలో మొదటి విడత ఎన్నికలలో 192 సర్పంచ్, 1740 వార్డు సభ్యల స్ధానాలకు ఈనెల 29 శనివారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. మొదటి విడుతలో 3వేల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఎన్నికల విధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత పోటీ అభ్యర్థుల ప్రకటన, వారికి గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై పూర్తి బాధ్యతతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు, ఓటర్ జాబితా వివరాలు సంబంధిత పోటీ చేసే అభ్యర్థులకు సమాచారం అందిస్తామని అన్నారు. నామినేషన్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీ, ప్రచారాలు అనుమతి లేవని, ఎన్నికల ప్రచార నిమిత్తం ర్యాలీ, సమావేశాల నిర్వహణకు ముందస్తూ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


