సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు
వనసంపదను ప్రతి ఒక్కరూ కాపాడాలి
సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి డీఎంఎఫ్‌టీ నిధులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
నీలాద్రి అర్బన్ పార్కులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చైన్ లింక్ ఫెన్సింగ్, ఎకోప్రెండ్లీ సఫారీ వెహికల్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయనంద్, సిసిఎఫ్ భీమా నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ్ విక్రం సింగ్‌లోత కలిసి ప్రారంభించారు. బ్యాటరీ అపరేటెడ్ వెహికల్ లో కలెక్టర్ ను ప్రక్కన కూర్చోపెట్టుకొని మంత్రి డైవింగ్ చేస్తూ పార్క్ మొత్తం వీక్షించారు. తర్వాత సత్తుపల్లి ఖమ్మం ప్రధాన రోడ్డులోని అటవీశాఖ డివిజన్ కార్యాలయం నందు అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగూచ్ఛం ఉంచి నివాళులు అర్పించి మొక్కను నాటారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోడియంను ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ సత్తుపల్లి కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మీటింగ్ హాల్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అడవుల సంరక్షణ పర్యవేక్షణ కోసం అటవీ సిబ్బందికి రక్షణ పరికరాలు, మొబైల్ ఫోన్ లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణ సుందరీకరణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజల హృదయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు చిరస్థాయిలో నిలిచిపోతారని అన్నారు. బేతుపల్లి హై లెవెల్ కెనాల్, వేంసూరు ఎత్తిపోతల పథకం వంటి కొన్ని అభివృద్ధి పనులను భగవంతుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పూర్తిచేసే అవకాశం సత్తుపల్లి ప్రజలు తనకు అందించారని మంత్రి తెలిపారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
రాజకీయాల, పార్టీలకతీతంగా సత్తుపల్లి కేంద్రంగా గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే లైన్, నీటి పారుదల సౌకర్యం కల్పన అభివృద్ధి పనులు జరిగేందుకు తన వంతు కృషి చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. సత్తుపల్లి గౌరవం కాపాడే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని అన్నారు. నీలాద్రి అర్బన్ పార్క్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తయారు చేస్తే ప్రభుత్వంతో చర్చించి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. సత్తుపల్లిలో జరిగే పని రాష్ట్రమంతా విస్తరించేలా చూడాలని అన్నారు. మన దగ్గర ఉన్న చెరువు, బడి, కళాశాల, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. సింగరేణి వల్ల సత్తుపల్లి నియోజక వర్గ పరిధిలో ఉత్పన్నమయ్యే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ నష్టపోయిన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా సంబంధిత శాఖ మంత్రి, సింగరేణి ఎండితో చర్చిస్తామని, దీనికి అనుగుణంగా సమగ్ర రిపోర్టు తయారు చేయాలని తెలిపారు.
గోదావరి జలాలు తీసుకొస్తాం..!
సీతారామ ఎత్తిపోతల పథకం కింద యాతాలకుంట టన్నెల్, ఇతర పనులు పూర్తి చేసేందుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేస్తే రాబోయే జూన్ నాటికి గోదావరి జలాలను తీసుకుని వస్తానని మంత్రి తెలిపారు.వేంసూరు మండలానికి కృష్ణ జలాలతో పాటు గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో కల్లూరు గూడెంలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ పంట ఉత్పత్తి పెరిగేందుకు తెనే టీగలను పెంచాలని అన్నారు. చిన్నపిల్లలు ఆకర్షితులయ్యే విధంగా జంతువులు, ఇతర వసతులను పార్కులో ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన పూర్తి సహాయ, సహకారం ప్రభుత్వం తరపున అందిస్తామని అన్నారు. మొక్కల పెంపకం ప్రణాళిక ప్రకారం చేయాలని, రోడ్ల విస్తరణ ప్రణాళికలు ఉన్న ప్రదేశాలలో రోడ్లకు కొంత దూరంలో మొక్కలు పెట్టాలని, కరెంట్ తీగలు క్రింద ఎటువంటి మొక్కలు పెట్టాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.
త్వరలోనే అర్బన్ పార్క్ : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వచ్చే దుష్పరిణామా లను తగ్గించేందుకు వీలుగా అర్బన్ పార్క్ ను వీలైనంత మేరకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, మంత్రివర్యులతో కలిసి నీలాద్రి అర్బన్ పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అర్బన్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆటవీ శాఖ సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ నీలాద్రి అర్బన్ ఫారెస్ట్ లో మనం సృష్టించిన వన సంపదను శాశ్వతంగా కాపాడుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ సంరక్షణ కోసం అటవీ శాఖకు డ్రోన్ కెమెరాలను అందించడం జరుగుతుందని, వెలుగు మట్ల, నీలాద్రి అర్బన్ ఫారెస్ట్ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ నెలా అటవీ సంరక్షణ కోసం ఎఫ్.పి.సి. కమిటీ సమావేశాలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమయ్యే చిన్న, చిన్న సమస్యలు ఏర్పాటుకు పరిష్కరించుకోవాలని అన్నారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమం లో ఎస్ఎఫ్ఎస్ మంజుల, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


